President's Message
సింగపూర్ లో నివసిస్తున్న తెలుగు సోదర, సోదరీమణులకు నమస్సుమాంజలి.
మన సంస్కృతి, సాంప్రదాయ పరిరక్షణ కోసం, మనలోని స్నేహ, సౌభ్రాతృత్వ, సద్భావములని పెంపొందించి, సహాయ సహకారములని పరస్పరం
పంచి, మాతృ భూమికి దూరమైనా, మాతృ భాషకి మరియు మాతృ భూమికై మనలోని సేవా గుణాన్ని నిలుపుటకై ఆవిర్భవించిన మన సింగపూర్
తెలుగు సమాజం నలభైవ వసంతం లో అడుగిడుతున్న శుభ తరుణాన మీ అందరికి శుభాకాంక్షలు.
2017 అక్టోబర్ 29న జరిగిన సింగపూర్ తెలుగు సమాజం 41వ వార్షికం సర్వ సభ్య సభలో నన్ను అధ్యక్షుడుగా ఎన్నుకొని, సమాజ ప్రస్థాన
భాద్యతలను నాకు, నా కార్యవర్గ సభ్యులకు అప్పగించిన మీకు వినమ్రతతో కూడిన ధన్యవాదములు తెలుపుతూ క్లుప్తంగా నా తొలి మాటని మీకు
సగౌరవంగా కింద పొందుపరుస్తున్నాను.
నాలుగు దశాబ్దాలుగా మన ఉనికిని కాపాడుతూ, మనల్ని అలరిస్తూ, ఆదరిస్తూ తెలుగు సమాజ ప్రగతికి శ్రమించిన గత అధ్యక్షులు, కార్యవర్గ
సభ్యులు, ప్రోత్సహించిన ప్రముఖులందరికీ మనందరి తరఫున మనస్పూర్తిగా కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను.
మారిన కాలంలో గతం ఒక ప్రామాణికం కాకుండా, సింగపూర్ తెలుగు సమాజం లో కొత్త ఒరవడిని సృష్టించి తెలుగు వారి కీర్తి, ఖ్యాతి, ప్రగతికై ఉన్నత
లక్ష్యాలని నిర్దేశించి, సాధించి సఫళీకృతులము కాగలమని సంకల్పిద్దాం. సింగపూర్ తెలుగు సమాజాన్నీ ఉన్నత శిఖరాలకు చేరుద్దాము.
మన భావితరాలు తెలుగుని పరిరక్షించుకునే ఉన్నత ఆలోచనలో భాగంగా మా కార్యవర్గం సింగపూర్ విద్యాలయాలలో తెలుగు ని ద్వితీయ భాష
గా పెట్టడానికి శ్రమిస్తుందని, అందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలని ముమ్మరం చేస్తూ, వచ్చిన అవకాశములని సద్వినియోగ పరుచుకుంటాము
అని సవినయంగా మనవి చేస్తున్నాను.
సాంస్కృతిక కార్యక్రమములు, సరదా సమ్మేళనాలు , విందు భోజనములు, సభ్యులకు ప్రోత్సాహము నిచ్చే ఆకర్షణ లే కాకుండా మరింత నూతనత్వంకై
కృషి చేద్దాం. అద్భుతమైన కార్యక్రమములకు రూపకల్పన చేద్దాం. వయసుతో నిమిత్తం లేకుండా మీరు కనపర్చే ఆసక్తులు, ఆశయాలే తెలుగు
సమాజం రాబోయే కార్యక్రమాలు.... రాష్ట్రములు వేరు కాని , దేశములు వేరు కాని, వర్గ, వర్ణములు ఏదైనా కాని, మాతృ భాష ఒకటైన వారి కోసమే
మన సమాజమన్న ఆవశ్యకతని సదా గుర్తించుకుని ప్రగతికి బాటలు వేసుకుందాము.
మాతృభాష పరిరక్షణ నిరంతర ప్రయాస. ప్రతి మనషికి ఇది కావాలి ఓ అభిలాష. పర భాషా జ్ఞానం సంపాదించండి , కానీ మీ మనో వికాసానికి మీ
మాతృ భాషలో వీలైనంతగా సంభాషించండి . తెలుగు లో సంభాషించడం అంటే తల్లిని గౌరవించడం అని గుర్తించండి. దేశ భాష లందు తెలుగు
లెస్స అన్న శ్రీ కృష్ణ రాయుడి మాటలు, మాటలు కాదు సద్ది మూటలు నిజం అని రుజువు చేద్దాము.
మన పూర్వికులపై మనకున్న గౌరవం, మన పిల్లలపై మనకున్న మమకారం, మన తర్వాత కూడా మనం జీవించగల మార్గం మన భాషకి మనం
చేసే ఇసుమంత సేవ. ఒక్కొక్కరుగా ఒక చేయి వేయండి. తోటి తెలుగు వారిని ప్రభావితం చేయండి . సింగపూర్ నలు దిశలా తెలుగు మాట్లేడే ప్రతీ
ఒక్కరు మన సమాజ సభ్యులుగా చేరండి. సభ్యులుగా నిలువండి. సందేహాలున్న మమ్ములని సంప్రదించి నివృత్తి చేసుకోండి. ఇది ప్రతి తెలుగు
వారికి మా ప్రార్ధన. మీ అందరికి కలుగుతుంది ఈ సమాజం మనదే అన్న భావన.
సింగపూర్ తెలుగు సమాజ సభ్యత్వం మన బాధ్యత - తెలుగు వాడిగా సార్ధకత.
నేను, నా అన్న ఆలోచన వదులదాం, మన సమాజం గురించి ఆలోచిద్దాం
ఇది నా సమాజం, మన సమాజం, మనందరి తెలుగు సమాజం....
మీ,
కోటి